రైళ్లలో బాణసంచా, పేలుడు పదార్థాల రవాణా నిషిద్ధం: దక్షిణ తీర రైల్వే హెచ్చరిక
నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా
రైల్వే ప్రాంగణాలు, బోగీల్లో ముమ్మర తనిఖీలు: సీపీఆర్వో వై. బాలాజీ కిరణ్
విశాఖపట్నం: దీపావళి పండుగ వేళ రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో బాణసంచా, మండే స్వభావం గల వస్తువులు, పేలుడు పదార్థాలను తీసుకెళ్లడంపై దక్షిణ తీర రైల్వే (SCoR) కఠిన ఆంక్షలు విధించింది. ప్రయాణికులు ఎవరూ తమతో పాటు టపాసులు, ఇతర ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లకూడదని, తోటి ప్రయాణికులను కూడా అనుమతించవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
రైల్వే చట్టం–1989 ప్రకారం ప్యాసింజర్ రైళ్లలో బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, పెట్రోల్, కిరోసిన్ వంటి మండే పదార్థాలను తీసుకెళ్లడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నేరానికి పాల్పడిన వారికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించబడుతుందని, రైల్వే ఆస్తికి లేదా తోటి ప్రయాణికులకు ఏదైనా నష్టం, ప్రమాదం వాటిల్లితే పూర్తి బాధ్యత వారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రత్యేక భద్రతా తనిఖీలు (స్పెషల్ సేఫ్టీ డ్రైవ్): ప్రమాదకర పదార్థాల రవాణాను అరికట్టేందుకు దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలో విస్తృతంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), సివిల్ డిఫెన్స్ వాలంటీర్లతో కూడిన ప్రత్యేక బృందాలు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా టికెట్ కలెక్టర్లు (TTEs), కోచ్ అటెండెంట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మేనేజర్లు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. పార్సిల్ వ్యాన్లలో లోడ్ చేసే లగేజీ, పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, గూడ్స్ షెడ్లు, సైడింగుల వద్ద భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనుమానిత వస్తువులు కనిపిస్తే '139'కి సమాచారం ఇవ్వండి: రైలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ రైల్వే వ్యవస్థకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తోటి ప్రయాణికులు ఎవరైనా బాణసంచా లేదా మండే పదార్థాలను తీసుకెళ్తున్నట్లు గమనించినా, అనుమానాస్పద బ్యాగులు కనిపించినా వెంటనే రైల్వే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 139 కి సమాచారం అందించాలని దక్షిణ తీర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) వై. బాలాజీ కిరణ్ ప్రకటనలో కోరారు.


