DSF డిమాండ్.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రెస్‌మీట్
ఆదోని: సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు DSF ఆధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా DSF ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి విద్యార్థి సంఘాలు పోరాడుతున్నాయని తెలిపారు. హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నాయకులను అనుమతించకపోవడం వల్ల విద్యార్థుల సమస్యలు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే హక్కును హరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునే అవకాశం విద్యార్థి సంఘాల నాయకులకు కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశంపై నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం DSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హరి, విక్రమ్, రమణ, వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.


