వైసీపీ వృద్ధులు, రాజకీయ నిరుద్యోగులతో నిరసనలు చేయిస్తోంది
ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు
ఆదోని: మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు వెళ్తున్న కూటమి ఎమ్మెల్యే పార్థసారథిని అడ్డుకోవడం సిగ్గుచేటని ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు విమర్శించారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.
ఆదోనిలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, రాజకీయ నిరుద్యోగులతో వైసీపీ నిరసనలు చేయిస్తోందని విమర్శించారు. మెగా డీఎస్సీ సక్రమంగా జరిగిందని ఉపాధ్యాయులే చెబుతున్నారని అన్నారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులపై కేసులు ఎందుకు పెట్టారో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా లేవని అప్పట్లో వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసేందుకు వైసీపీ కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం అర్థం చేసుకున్నందునే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వైసీపీ హయాంలో నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు గుండెపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారని రామాంజనేయులు అన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులపై కేసులు ఎందుకు పెట్టారో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిరుద్యోగులు ప్రశ్నించాలని ఆయన సూచించారు. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డుకునేందుకు వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీబీఐపైనే కేసులు పెట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలోనూ సీబీఐపై వైసీపీ వైఖరిని ప్రశ్నించారు. మెగా డీఎస్సీకి సంబంధించి ఆడియోలు లీక్ చేస్తోంది వైసీపీ నేతలేనని బెస్త రామాంజనేయులు ఆరోపించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా, వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు


